Pakistan : ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకపోవడం పెద్ద వివాదం చెలరేగింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా తాము ఇలా చేశామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) దీనిని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తూ తమ నిరసనను వ్యక్తం చేసింది.
అంతేకాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అతను తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ అతడిని టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే ఆసియా కప్‌లోని మిగతా మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతామని కూడా పాక్ బెదిరించింది.
దీనిని ఐసీసీ పెద్దగా పట్టించుకోకపోవడంతో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ మీడియా సమావేశాన్ని రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక కారణం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ముఖ్యంగా హ్యాండ్‌షేక్ వివాదంపై మాట్లాడటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పాకిస్తాన్ జట్టు ఒత్తిడిలో ఉందని, తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ ఆసియా కప్‌లో పాకిస్తాన్ భవిష్యత్తుపై తీవ్ర సందేహాలను కలిగిస్తున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆండీ పైక్రాఫ్ట్ ను తప్పించకపోతే.. ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బెదిరించిన పాక్ చివరికి యూటర్న్ తీసుకుంది.
టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే భారీ ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి కాబట్టి పాకిస్తాన్ జట్టు ఈ వివాదాలను పక్కన పెట్టి యూఏఈతో మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని పీసీబీ వర్గాలు టీమ్ కి సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధిస్తుంది.