Divorce: భార్యతో విడాకులు వచ్చాయని దేవుడికి మొక్కు.. 9 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం!

Divorce

Divorce:  బస్తీకి చెందిన ఒక 25 ఏళ్ల యువకుడు తన విడాకుల మంజూరీని ఒక వినూత్న రీతిలో జరుపుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా విడాకుల తర్వాత పార్టీలు చేసుకోవడం చూస్తుంటాం, కానీ ఇతను మాత్రం దేవుడికి మొక్కు తీర్చుకుంటూ ఏకంగా 9 కిలోమీటర్ల ‘దండవత్ యాత్ర’ (సాష్టాంగ నమస్కారం చేస్తూ సాగే యాత్ర) చేపట్టాడు.

నార్ఖోరియా గ్రామానికి చెందిన జోగేష్ అనే యువకుడికి 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లయినప్పటి నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వేధింపులు భరించలేక విడాకులు కావాలని అతను ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆ కష్టకాలంలో.. “తనకు విడాకులు మంజూరై ఈ బంధం నుంచి విముక్తి లభిస్తే, స్థానిక బైదా సమయ్ మాత ఆలయానికి దండవత్ యాత్ర చేస్తానని” మొక్కుకున్నాడు.

2026 జనవరిలో జోగేష్‌కు చట్టబద్ధంగా విడాకులు మంజూరయ్యాయి. దీంతో నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, తన మొక్కు తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ యాత్రలో.. నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఆ మార్క్ దగ్గరకు జరిగి మళ్లీ నమస్కరిస్తూ 9 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 12 గంటల పాటు శ్రమించి పూర్తి చేశాడు. రోజంతా ఉపవాసం ఉండి, “జై శ్రీరామ్”, “జై బజరంగబలి” నినాదాలతో ఆలయానికి చేరుకున్నాడు.

ఈ యాత్రకు సంబంధించి జోగేష్ ముందే అధికారుల అనుమతి తీసుకున్నాడు. ఎస్డీఎం అనుమతితో పోలీసులు అతనికి రక్షణగా నిలిచారు. జోగేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఈ యాత్రలో అతని వెంట నడిచారు. ఆలయానికి చేరుకున్నాక కొబ్బరికాయ కొట్టి, మొక్కు తీర్చుకుని తన ఉపవాసాన్ని విరమించాడు. ప్రస్తుతం ఈ వింత మొక్కుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.