Bengaluru Doctor : డాక్టర్ కృత్తికా రెడ్డి హత్య కేసులో సంచలన ట్విస్ట్!

Bengaluru

Bengaluru Doctor: బెంగళూరులో సంచలనం సృష్టించిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృత్తికా రెడ్డి (29) హత్య కేసులో సంచలన ట్విస్ట్ నెలకొంది. ఆమె భర్త, నిందితుడైన జనరల్ సర్జన్ డా.మహేంద్ర రెడ్డిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృత్తికా రెడ్డిని హత్య చేసేందుకు మహేంద్ర రెడ్డి తాను పనిచేస్తున్న విక్టోరియా ఆసుపత్రి నుంచి తీసుకువచ్చిన నాట్ ఫర్ సేల్ (Not For Sale) అనస్థీషియా మందులను ఉపయోగించినట్లుగా దర్యాప్తులో తేలింది.

ఆసుపత్రిలో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న కారణంగా మహేంద్ర రెడ్డికి ఆ ఆసుపత్రిలో ఫ్రీడమ్ ఉంది. అయితే దీనిని మంచి అవకాశంగా భావించి సర్జరీ డిపార్ట్ మెంట్ కు మాత్రమే పరిమితమైన అనస్థీషియా ఇంజక్షన్లను అక్రమంగా ఇంటికి తీసుకువచ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా తన భార్యకు కుడి కాలికి అధిక మొత్తంలో అనస్థీషియా డోస్‌ను ఇచ్చాడు. సాధారణంగా ఎవరైనా ఐవీ డ్రిప్ చేతికి వేస్తారు, కానీ అతను కాలికి వేయడం ద్వారా ఇతరులకు అనుమానం రాకుండా ఉంటుందని ప్లాన్ చేశాడు. తన భర్త డాక్టరనే అనే అతి నమ్మకంతో కృత్తికా కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.

ఆస్తి, అక్రమ సంబంధం కోసమే

ఆస్తి, అక్రమ సంబంధం కోసమే మహేంద్ర రెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మహేంద్రకు తన అసిస్టెంట్ డాక్టర్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కృత్తిక తండ్రికి కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. ఆస్తిపై ఆశతో ఆరు నెలల కిందటే హత్యకు పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రైవేటుగా ఓ ఆసుపత్రి పెడదాం అంటే కూడా కృత్తిక తండ్రి ఏ మాత్రం సహకరించలేదని దీంతో వారి కుటుంబం పై అతను పగ పెంచుకున్నట్లుగా సమాచారం.

విచారణలో మహేంద్ర రెడ్డి తాను తన భార్యను చంపలేదని, పెళ్లికి మందే కృత్తికకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని వాదించాడు. కానీ, కృత్తిక తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెకు కేవలం గ్యాస్ట్రిక్ సమస్య, తక్కువ బీపీ తప్ప మరే ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. 2024 మే 6న వివాహం చేసుకున్నారు మహేంద్ర రెడ్డి,కృత్తికా రెడ్డి. 2025 ఏప్రిల్ 24న కృత్తికా రెడ్డి మరణించింది. మరణానంతరం నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలలో ఆమెకు అనస్థీషియా డోస్ ఇచ్చారని ఆరు నెలల తరువాత తేలింది. దీంతో పోలీసులు మహేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.