Hyderabad : డ్రగ్స్‌ ఓవర్ డోస్‌.. ఆటోలో డెడ్ బాడీలు!

Hyderabad

Hyderabad : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం రేపింది. రోమన్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి యువకుల మృతదేహాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)గా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా, వీరిద్దరూ డ్రగ్స్‌ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటోకు సమీపంలో పోలీసులు తనిఖీ చేయగా, డ్రగ్ ఇంజక్షన్స్ లభించాయి. ఈ ఆధారాల వల్ల డ్రగ్స్ ఓవర్ డోస్‌తోనే మరణించారనే అనుమానం బలపడుతోంది.

ఘటనాస్థలంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. అక్కడ మూడు సిరంజీలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆటోను అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాల కోసం సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.