మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ చాలా ఉపయెగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సీడ్ సైక్లింగ్ అంటే స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను సహజంగా మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక పద్ధతి అన్నమాట.
సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలను ఒక ప్రత్యేక విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. ఇది PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తినొచ్చు.
సీడ్ సైక్లింగ్‌ను ఋతు చక్రంలోని రెండు దశలకు అనుగుణంగా చేస్తారు.
మొదటి దశ : -ఫోలిక్యులర్ దశ
సీడ్ సైక్లింగ్‌లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వరోజు నుంచి పీరియడ్స్ మొదటి రోజు వరకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్‌లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, ఈ దశలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. గుమ్మడి గింజలలోని జింక్, అవిసె గింజలలోని ఫైటోఈస్ట్రోజెన్స్, ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి.
రెండవ దశ: లూటియల్ దశ
ఇక రెండవ దశ లూటియల్ దశ ఓవ్యులేషన్ అయిన తర్వాత (15వ రోజు) నుంచి తదుపరి పీరియడ్స్ మొదలయ్యే వరకు. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి. ఇవి గర్భం దాల్చడంలో సహాయపడతాయి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజల పొడి (Sunflower seeds), ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి (Sesame seeds) తీసుకోవాలి.
ఈ విత్తనాలను పొడి చేసి తీసుకోవడం ముఖ్యం. పొడిగా చేస్తేనే వాటిలోని పోషకాలు శరీరం ద్వారా సులభంగా అందుతాయి. విత్తనాలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో పొడి చేయకుండా, ప్రతిరోజూ తాజాగా పొడి చేసుకుంటే మంచిది. మంచి ఫలితాల కోసం, ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించాలి.