టైమ్ బ్యాడ్ గురూ.. IndiGo దెబ్బకు ఆన్‌లైన్ రిసెప్షన్

indigo

IndiGo : దేశవ్యాప్తంగా ఇండిగో విమాన రద్దుల కారణంగా ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే. ఇక కర్ణాటకలోని హుబ్బళిలో జరిగిన ఓ రిసెప్షన్ కు కొత్తగా పెళ్లైన దంపతులే హాజరు కాలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకా.. 1400 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయిన నవదంపతులు తమ సొంత రిసెప్షన్‌ను వీడియో కాల్ ద్వారా హాజరుకావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. హుబ్బళికి చెందిన మేఘా క్షీరసాగర్, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ్ దాస్ ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

వీరి పెళ్లి నవంబర్ 23న భువనేశ్వర్‌లో జరిగింది. డిసెంబర్ 3, బుధవారం నాడు హుబ్బళిలోని గుజరాత్ భవన్‌లో వీరి రిసెప్షన్ కు ఏర్పాట్లు చేశారు. మేఘా, సంగమ్ దంపతులు డిసెంబర్ 2న బెంగళూరు మీదుగా హుబ్బళికి చేరుకోవడానికి ఇండిగో విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, డిసెంబర్ 2 ఉదయం మొదలైన విమానాల ఆలస్యం రాత్రంతా కొనసాగింది. డిసెంబర్ 3 తెల్లవారుజామున 4 గంటల సమయానికి, వారి విమానం రద్దు అయినట్లు వారికి సమాచారం అందింది.

ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో ఆ దంపతులు 1400 కి.మీ. దూరంలో చిక్కుకుపోయారు. రిసెప్షన్ కోసం బంధువులు, అతిథులు ఇప్పటికే గుజరాత్ భవన్‌కు చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నా, పెళ్లికూతురు, పెళ్లికొడుకు రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో అతిథులు అందరూ వచ్చినందున వేడుకను కొనసాగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

రిసెప్షన్ వేదికపై ఒక పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఆ దంపతులను వర్చువల్‌గా వేడుకకు ఆహ్వానించారు. సాధారణంగా నవదంపతులు కూర్చునే స్థానంలో వధువు తల్లిదండ్రులు కూర్చుని మిగితావ్యవహారాలను నిర్వహించారు. మేఘా, సంగమ్ దంపతులు భువనేశ్వర్‌లో అలంకరించుకుని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతిథుల ఆశీస్సులు అందుకున్నారు. విమాన రద్దు కారణంగా రిసెప్షన్ పూర్తిగా ఆన్‌లైన్ వేడుకగా మారింది.