Kerala Businessman : బాస్ అంటే ఇతనే.. భారత్ గెలిచిందని ఉద్యోగులకు బోనస్!

Kerala Businessman

Kerala Businessman : భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంతో దేశమంతా పండుగ చేసుకుంటోంది. ఈ సంతోషాన్ని తన సిబ్బందితో పంచుకోవాలని నిర్ణయించుకున్న కేరళకు చెందిన ఒక వ్యాపారి, తన ఉద్యోగులందరికీ నగదు బహుమతులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. నితిన్ బాబు అనే 37 ఏళ్ల వ్యాపారవేత్త తన రెండు గార్మెంట్ స్టోర్లలో పనిచేస్తున్న 82 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున మొత్తం 1.64 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చారు.

నితిన్ బాబుకు క్రికెట్ అంటే ప్రాణం, ముఖ్యంగా కేరళ క్రికెటర్ సంజు శామ్సన్ అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. ఈ ప్రపంచకప్‌లో సంజు శామ్సన్ అద్భుతంగా ఆడటమే నితిన్ ఈ స్థాయిలో సంబరాలు చేసుకోవడానికి ప్రధాన కారణం. ఫైనల్ మ్యాచ్‌లో సంజు కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసి ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో నితిన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. “సంజు ఏదైనా సాధిస్తే అది నా సొంత విజయంగా భావిస్తాను” అని ఆయన ఎంతో గర్వంగా చెప్పారు.

నిజానికి నితిన్ బాబు ఇలా బహుమతులు ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. ఈ టోర్నమెంట్ జరుగుతున్నంత కాలం సంజు శామ్సన్ బాగా ఆడినప్పుడల్లా ఆయన తన ఉద్యోగులకు డబ్బులు పంచుతూనే ఉన్నారు. సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సంజు 97 పరుగులు చేసినప్పుడు తన స్టోర్ లోని 62 మందికి తలా 500 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సంజు రాణించినప్పుడు ప్రతి ఉద్యోగికి 1,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు.

నితిన్ బాబుకి క్రికెట్ పట్ల ఉన్న పిచ్చి ఎంతంటే.. ఇంట్లో మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా ప్యాడ్లు, గ్లౌజులు ధరించి, పక్కన బ్యాట్ పెట్టుకుని మరీ టీవీ చూస్తారట. సంజు బ్యాటింగ్ చేస్తుంటే తనే క్రీజులో ఉన్నట్టు అనిపిస్తుందని ఆయన అంటారు. తన వ్యాపారానికి అండగా నిలుస్తున్న సిబ్బందితో ఈ గెలుపు సంతోషాన్ని పంచుకోవడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.