దేశంలోని టాప్ -100 కుబేరుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించి టాప్ -100 భారత కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 105 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ ప్రథమస్థానంలో ఉన్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 12 శాతం క్షీణించింది.
92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 100 మంది భారత కుబేరుల సంపద విలువ 2025లో 9 శాతం పడిపోయి, 1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు ఫోర్బ్స్ పేర్కొంది. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ఇందుకు కారణమైనట్టు తెలిపింది.
OP జిందాల్ గ్రూప్ నకు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానంలో ఉండగా, టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్ నాలుగో స్థానంలో ఉన్నారు. టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదోస్థానంలో నిలిచారు. ఆర్థిక సమాచారం, విశ్లేషకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, నియంత్రణ సంస్థల నుంచి సేకరించిన వివరాలతో సంపద విలువను అంచనా వేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది