Bihar Elections : ఈయన పేరు అనంత్ సింగ్. బిహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిగా మొకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 28,206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంత్ సింగ్ ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఐదోసారి గెలుపు. 2020 ఎన్నికలకు ముందు ఆర్జేడీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో ఆయుధాల సరఫరాకు సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో ఎమ్మెల్యే సీటు పోయింది.
అయితే ఊరుకుంటారా? తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య నీలందేవిని నిలబెట్టారు. ఆమె గెలుపు కోసం ఏం చేయాలో అది చేశారు. దాంతో ఆమె విజయం సాధించారు. అనంతరం ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్యకేసులో మరోసారి అనంత్ సింగ్ అరెస్టయ్యారు. ఆయనిప్పుడు జైల్లోనే ఉన్నారు.
ఈసారి అనంత్ సింగ్ జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇవన్నీ పెద్ద విశేషాలు కాదు. ఆయనపై 28 క్రిమినల్ కేసులున్నాయి. అదీ విశేషం. అయినా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనానికి ఎంత గొప్పగా సేవ చేయకపోతే ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు చెప్పండి. పైగా జైలు నుంచి కూడా ఎన్నికయ్యారు. ఎంతైనా బిహార్..బిహారేనబ్బా!
మొకామా స్థానం నుంచి ఐదుసార్లు గెలిచిన సింగ్ 2005లో అసెంబ్లీకి అరంగేట్రం చేశారు. జెడియు నుంచి పోటీ చేసిన సింగ్ 2010లో తన స్థానాన్ని నిలుపుకున్నారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత పార్టీని వీడారు. 2015లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడియు అభ్యర్థిని ఓడించారు. 2020 ఎన్నికలకు ముందు ఆయన ఆర్జేడీకి మారి మళ్ళీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన దులార్ సింగ్ యాదవ్ హత్య కేసులో నవంబర్ 2న అనంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ప్రశాంత్ కిషోర్ జెఎస్‌పి టికెట్‌పై పోటీ చేసిన ప్రియదర్శి పియూష్ తరపున ప్రచారం చేస్తున్నప్పుడు దులార్ సింగ్ యాదవ్ హత్యకు గురయ్యారు.
