Moosapet : కూకట్పల్లి పరిధిలోని మూసాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన ఐదు నెలలకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. దంపతుల మధ్య జరిగిన వాగ్వివాదమే ఈ ఘటనకు దారితీసినట్లుగా తెలుస్తోంది. ముసాపేట్ అంజయ్య నగర్‌కు చెందిన చందన జ్యోతికి(24) యశ్వంత్‌తో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది.
అయితే శుక్రవారం రాత్రి (తేదీ 12/12/2025) చందన జ్యోతి, ఆమె భర్త యశ్వంత్ మధ్య గొడవ జరిగింది. దీంతో అర్థరాత్రి సమయంలో చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివాహమైన స్వల్ప కాలంలోనే వధువు ఆత్మహత్య చేసుకోవడంతో, దీని వెనుక గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఆత్మహత్య జరిగిందా? లేక అదనపు కట్నం వేధింపులు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
