Dude : మొన్న ‘డ్యూడ్’ సినిమా ప్రెస్‌మీట్‌లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌ని ఓ మహిళా జర్నలిస్ట్ ‘మీరు హీరో మెటీరియల్‌లా కనబడరు. దీన్ని మీరెలా చూస్తారు?’ అని ఓ అడగటం చాలా ట్రోల్‌కి గురైంది. అఫ్‌కోర్స్, ప్రదీప్ రంగనాథన్ చక్కటి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి మన తెలుగువారు కూడా అతని మీద అభిమానంతో ఆ మహిళా జర్నలిస్ట్‌ని తిట్టిపోశారు. అలా అడగటం నూటికి నూరు శాతం తప్పే. ‘హీరో మెటీరియల్’ అనేదానికి కొన్ని డెఫినిషన్లు ఉంటే వాటికింద ఇవాళ్టి చాలామంది పెద్ద హీరోలు రారు. ఆ లెక్కన వారంతా హీరోలు కానట్లే. కానీ అయ్యారు. చక్కగా నటించారు. మెప్పించారు.
ఇప్పుడు రియాలిటీ ఏంటంటే, ఈ సినిమా ప్రెస్‌మీట్‌లలో కూర్చున్న వారిలో రకరకాల ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. చాలామందికి ఆరోజు అక్కడ ప్రెస్‌మీట్ అన్న సంగతి కూడా గంటముందో, పొద్దున్నో చెప్తారు. ఏం అడగాలో ప్రిపేర్ అయ్యేంత టైం ఇవాళ ఛానెల్స్ ఇస్తాయా అనేది డౌటే. తాము అడగాలనుకున్నది అప్పటికే పక్కవారు అడిగేస్తే ఆ పరిస్థితి ఇంకా విచిత్రంగా తయారవుతూ ఉంటుంది. ఏదో ఒకటి అడగాలి, కానీ తాము అడగాలనుకున్నది ముందే అడిగేసేసి ఉంటారు. సీనియర్లకు అనుభవం ఉంటుంది కాబట్టి ఏదోలా మేనేజ్ చేస్తారు. కానీ కొత్తవారు కంగారు పడిపోతుంటారు.
అక్కడ అడిగేది మరొకటి
అలా మైండ్‌లో ఏదేదో రన్ అవుతున్నప్పుడు టక్కున మైక్ చేతికి తీసుకునే ఛాన్స్ వస్తుంది. ఆ హడావిడిలో తాము అడగాలనుకున్నది ఒకటి, అక్కడ అడిగేది ఒకటీ ఉంటుంది. ‘హీరోయిన్‌తో రొమాన్స్ చేశారా?’, ‘రాత్రికి మీరు ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తారా?’, ‘పెళ్లయ్యాక ఆ పని చేయాలంటే కష్టం కదా?’ ఇలాంటివి కూడా గతంలో సినిమా ప్రెస్‌మీట్‌లలో వినిపించిన ప్రశ్నలు. నిజానికి వాళ్ల ఉద్దేశాలు ఒకటి, అక్కడ అడిగేది మరొకటి. మొత్తంగా ఏదేదో బయటకు వచ్చి ట్రోలింగ్ జరుగుతూ ఉటుంది.(కొన్నిసార్లు కావాలనే కొన్ని ప్రశ్నలు అడిగి మరీ ట్రోలింగ్ చేసుకుంటుంటారు. అది ఈ కేటగిరీలో రాదు).
ప్రదీప్ రంగనాథన్‌ని మహిళా జర్నలిస్ట్ అలా అడిగిన వీడియో చూశాను. ఆమె గొంతులో వెటకారం, హాస్యం(కొంతమంది మగ జర్నలిస్టుల్లో నిత్యం కనిపించేవి) లేవు. కానీ తడబాటు వినిపించింది. ఏదో అడగబోయి దాన్ని మరేదో రకంగా అడిగేసిందామె. ఇదంతా వ్యక్తిగతంగా ఆమె తడబాటే తప్ప, అందులో జర్నలిజానికి మొత్తం ఆపాదించేంత పెద్ద దోషం ఉందని ఒక జర్నలిస్టుగా నేనైతే అనుకోను.
ప్రదీప్ హీరో మెటీరియల్ అయితే ఏంటి.. కాకపోతే ఏంటి? బాగా నటిస్తాడు. అంతే! ఒక్కోసారి హీరో మెటీరియల్‌లాగా కనబడకపోవడమే మేలు.
– విశీ(వి.సాయివంశీ)