PM Suraksha Bima Yojana : మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 20 లేకపోతే.. రూ. 2 లక్షలు లాస్!

PM Suraksha Bima Yojana

PM Suraksha Bima Yojana : మీ బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ అకౌంట్‌లో కేవలం రూ. 20 లేకపోవడం వల్ల భవిష్యత్తులో మీ కుటుంబం ఏకంగా రూ. 2 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకానికి సంబంధించింది.

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తోంది. ప్రతి ఏడాది మే 31వ తేదీన మీ ఖాతా నుండి ఈ డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఒకవేళ ఆ సమయానికి మీ అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేకపోతే మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా అటోమెటిక్ గా రద్దవుతుంది.

దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే, మీ కుటుంబానికి రావాల్సిన రూ. 2 లక్షల బీమా డబ్బు రాదు అన్నమాట. సో మీ అకౌంట్లో ఎప్పుడూ కనీసం రూ.50-100 ఉండేలా జాగ్రత్త పడండి. కేవలం రూ. 20 కోసం ఇంత పెద్ద భరోసాను వదులుకోవద్దు.

ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన వెంటనే అంటే 2015, మే 9వ తేదీన కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఇది మొదలైనప్పుడు దీని ధర ఏడాదికి కేవలం రూ.12 మాత్రమే ఉండేది. కానీ 2022, జూన్ 1 నుండి దీన్ని రూ. 20కి పెంచారు.

ఒకవేళ ప్రమాదం జరిగి వ్యక్తి చనిపోయినా లేదా శాశ్వతంగా అంగవైకల్యం కలిగినా ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. సాధారణ మరణాలకు అంటే ఏదైనా జబ్బు చేసి చనిపోవడం వంటివి మాత్రంఈ స్కీమ్ వర్తించదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ పథకంలో చేరి లబ్ధి పొందుతున్నారు.

దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే, ఆ వ్యక్తి వారసులు ఎవరైనా 30 రోజుల్లోపు బ్యాంకుకు వెళ్లి సమాచారం ఇవ్వాలి. దీనికి ఎఫ్.ఐ.ఆర్, పంచనామా, పోస్టుమార్టం రిపోర్ట్ లేదా హాస్పిటల్ సర్టిఫికెట్ వంటివి జత చేయాల్సి ఉంటుంది.

18 ఏళ్ల నుండి 70 ఏళ్ల లోపు వారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ప్రమాదంలో రెండు కళ్లు లేదా రెండు కాళ్లు/చేతులు పూర్తిగా పోతే (శాశ్వత అంగవైకల్యం) రూ.2 లక్షలు ఇస్తారు. ఒక కన్ను లేదా ఒక కాలు/చెయ్యి మాత్రమే పోతే రూ. లక్ష ఇస్తారు. ఆధార్ కార్డుతో లింక్ అయిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే.