Real Estate Legal Documents : సొంత ఇల్లు లేదా ప్లాటు కొనడం అనేది మన జీవితంలో ఒక పెద్ద కల. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలు కూడా ఎక్కువే. అందుకే, రేటు తక్కువగా ఉంది కదా అని తొందరపడి కొనేయకుండా, ఆ ప్రాపర్టీకి సంబంధించిన పేపర్లు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు ఉన్నా, రేపు మన పిల్లలకు ఆ ఆస్తిని బదిలీ చేసేటప్పుడు లేదా బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు పెద్ద చిక్కులు వస్తాయి.
మొదటగా మనం చూడాల్సింది ‘సేల్ డీడ్’ (Sale Deed). ఇది అసలైన డాక్యుమెంట్. అంటే ఆ ఆస్తి అమ్మే వ్యక్తికి అది ఎలా వచ్చింది? ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా లేదా? అనేది ఇందులో ఉంటుంది. దీనితో పాటు ‘లింక్ డాక్యుమెంట్లు’ కూడా అడగాలి. అంటే, ఆ ప్లాటు లేదా ఇల్లు గత 30 ఏళ్లుగా ఎవరెవరి దగ్గర ఉంది, ఎవరెవరికి అమ్మారు అనే హిస్టరీ అంతా ఇందులో ఉంటుంది. ఈ లింకుల్లో ఏ ఒక్క పేపర్ మిస్ అయినా ఆ ఆస్తి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ఆ ఆస్తి మీద ఏవైనా గొడవలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ‘ఈసీ’ (EC – Encumbrance Certificate) తీయించాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్తే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఇందులో ఆ ఆస్తి మీద ఎవరైనా లోన్లు తీసుకున్నారా లేక తాకట్టు పెట్టారా అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే, మీరు కొనే ప్లాటుకు HMDA లేదా DTCP వంటి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పర్మిషన్ లేని లేఅవుట్లలో ప్లాట్లు కొంటే, తర్వాత ప్రభుత్వం వాటిని కూల్చేసే అవకాశం ఉంటుంది లేదా భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.
ఇక అపార్ట్‌మెంట్లు లేదా విల్లాలు కొనేవారు ‘అప్రూవ్డ్ ప్లాన్’, ‘ఆక్యుపెన్సీ సర్టిఫికేట్’ (OC) ఖచ్చితంగా అడగాలి. బిల్డర్ పర్మిషన్ తీసుకున్న దానికంటే ఎక్కువ ఫ్లోర్లు కడితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు, దానివల్ల కరెంటు, నీళ్ల కనెక్షన్లు పొందడం కష్టమవుతుంది. వీటన్నింటితో పాటు ఇంటి పన్ను (Property Tax) కట్టిన రసీదులు కూడా చెక్ చేయండి. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఒక మంచి లాయర్‌కు ఆ పేపర్లు చూపించి సలహా తీసుకోవడం ఉత్తమం. లక్షలు పెట్టి కొనేటప్పుడు వెయ్యి రూపాయలు లాయర్ ఫీజు గురించి ఆలోచించకండి.
Real Estate Legal Documents : ప్లాట్లు లేదా ఇళ్లు కొంటున్నారా? ఈ డాక్యుమెంట్లు లేకపోతే మీ డబ్బు గోవిందా!
