Chicken Leg Pieces : పెళ్లి వేడుక అంటే పాటలు, విందు, వినోదాలు ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఒక పెళ్లిలో మాత్రం విందు కాస్తా గొడవగా అయిపోయింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ రాలేదన్న చిన్న కారణంతో మొదలైన వాగ్వాదం.. చివరికి కుర్చీలు విసురుకునే స్థాయికి చేరింది.
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. పెళ్లి కొడుకు తరపు వారు (బారాత్) భోజనానికి కూర్చున్న సమయంలో బిర్యానీ వడ్డించారు. అయితే వడ్డించిన బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు లేవని బారాత్ బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వడ్డించే వారితో మొదట మాటా మాటా పెరిగింది. చూస్తూ ఉండగానే పెళ్లి కొడుకు తరపు వారికి, పెళ్లి కూతురు తరపు వారికి మధ్య పెద్ద గొడవ మొదలైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఫంక్షన్ హాల్‌లోని డైనింగ్ ఏరియా అంతా గందరగోళంగా కనిపిస్తోంది. పదుల సంఖ్యలో జనం ఒకరినొకరు నెట్టుకుంటూ, తిట్టుకుంటూ కనిపించారు. కొందరైతే ఏకంగా భోజనాల టేబుల్స్ పైకి ఎక్కి మరీ బిర్యానీ పాత్రల్లో తమకు కావాల్సిన ముక్కల కోసం వెతకడం కెమెరాకు చిక్కింది.
UP के अमरोहा में ए लोग बिरयानी मै बोटी के लिए लड़ रहे, बताइए .. pic.twitter.com/i3EEGCiiT3
— Ankit Rawal (@ankitrawal5454) March 29, 2026
చిన్నపాటి వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీయడంతో.. అతిథులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులతో కొట్టుకున్నారు. భోజన వస్తువులు, పాత్రలు హాల్ అంతటా చిందరవందరగా పడిపోయాయి. అక్కడున్న మరికొందరు అతిథులు ఈ దారుణాన్ని తమ ఫోన్లలో రికార్డ్ చేస్తూ కనిపించారు.
పరిస్థితి విషమించడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఒక చిన్న ముక్క కోసం పెళ్లి వేడుకను ఇలా రణరంగంలా మార్చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. ముక్క కోసం ముష్టియుద్థానికి దిగుతారా అని మండిపడుతున్నారు.
