అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…

అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…

  08 Apr 2020

కరోనా సంక్షోభం, ప్రపంచ దేశాలు ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు సమ్మతించవచ్చనే అంచనాలమధ్య బుధవారం చమురు ధరలు ఎగిసాయి. ఒపెక్‌ సభ్య దేశాలు, రష్యా మధ్య ఉత్పత్తి తగింపునకు నిర్ణయించనున్నారనే ఆశలమధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తిగా చూపిస్తున్నారు. దీంతో ఇవాళ బ్రెంట్‌ క్రూడ్‌ 75 సెంట్లు (2.5శాతం) పెరిగి బ్యారెల్‌ ధర 32.62 డాలర్లకు చేరింది. నైమెక్స్ కూడా 5 శాతం ఎగిసింది. మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ 3.6 శాతం క్షీణించింది. అంతకుముందు సెషన్‌లో క్రూడాయిల్‌ ధర దాదాపు తొమ్మిదిన్నర శాతం తగ్గింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ముడి చమురు ధరలు గత కొంతకాలంగా భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్‌ దేశాలు, రష్యాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గురువారం ఒపెక్‌ సభ్యులు, రష్యాలు సమావేశం కానున్నాయి. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి తగ్గింపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా సమావేశంలో తీసుకోబోయే నిర్ణయంతో సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల యుధ్దానికి తెరపడే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా, ఒపెక్‌ సభ్యదేశాలు, రష్యాలు చమురు ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశముందని చెబుతున్నారు. అయితే ఉత్పత్తి కోత నిర్ణయంలో అమెరికా పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అమెరికా ముడి ఉత్పత్తి 4.70 లక్షల బీపీడీ తగ్గిందని, 2020లో మరో 1.3 మిలియన్‌ బీపీడీ తగ్గుతుందని ఇటీవలే అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఏపీఐ) గణాంకాల ప్రకారం అమెరికాలో పెట్టుబడులు ఏప్రిల్ 3 వరకు 11.9 మిలియన్ బారెల్స్ మేర పెరిగి 473.8 మిలియన్ బారెల్స్ కు చేరుకున్నాయి. వైరస్ వ్యాప్తి భయాలతో చమురుకు డిమాండ్ తగ్గడంతో,ఆయిల్ రంగ షేర్లు 9.4 మిలియన్ బారెల్స్ పెరిగాయి. ఇది జనవరి 2017తరువాత ఒక వారంలో అతిపెద్ద లాభంమిదేనని ఏపీఐ తెలిపింది.