ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్ : ఏసీపీపై బదిలీ వేటేసిన ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రగతీ భవన్ ముట్టడి… ఓ పోలీస్ అధికారి బదిలీకి కారణమైంది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఏకంగా ప్రగతీ భవన్ గేటు దాకా వెళ్లగలిగారు. తర్వాత ఆయన్ను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. రేవంత్ రెడ్డి, తర్వాత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతల్ని ప్రగతి భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే బుధవారం ఏబీవీపీ కార్యకర్తలు కూడా ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ప్రగతి భవన్ గేట్లు దూకి ఏబీవీపీ కార్యకర్తలు లోపలకి చొచ్చుకెళ్లారు. 300 మంది పోలీసుల కళ్లుగప్పి లోపలకి వెళ్లారు. దీంతో పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోశామహల్ స్టేషన్‌కు తరలించారు.

ప్రభుత్వం ఆగ్రహం

ప్రగతీ భవన్ ముట్టడిని పార్టీలు ప్రయత్నించడం, కొందరు మెయిన్ గేట్ దాకా రావడంతో పోలీసు ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే విధుల్లో అలసత్వం వహించారంటూ ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు వేసింది. నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలు డీసీపీ సుమతికి అప్పజెప్పారు.

Leave a Reply