Rajasthan: దొంగతనం చేయబోయి దొరికిపోవడం అనేది పాత పద్ధతి.. కానీ ఇక్కడ దొంగ మాత్రం ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయి దొరికిపోయాడు. రాజస్థాన్‌లోని కోటాలో వెలుగుచూసిన ఈ సినిమా సీన్‌ను చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇంట్లోకి చొరబడే క్రమంలో కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయి, గంటపాటు నిస్సహాయంగా వేలాడుతూ పోలీసులకు దొరికిపోయాడు.
అసలేం జరిగిందంటే.. సుభాష్ కుమార్ రావత్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జనవరి 3న ఖాటుశ్యామ్‌జీ దర్శనానికి వెళ్లారు. మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో వారు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం తీస్తుండగా, బయట పార్క్ చేసిన స్కూటర్ హెడ్ లైట్ల వెలుతురు కిచెన్ కిటికీపై పడింది. ఆ వెలుతురులో వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక వ్యక్తి సగం శరీరం లోపల, సగం శరీరం బయట ఉండేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో అడ్డంగా ఇరుక్కుపోయి ఉన్నాడు.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న దొంగ
రాజస్థాన్‌లోని కోటాలో ఒక వింత చోరీ యత్నం వెలుగు చూసింది. పవన్ అనే వ్యక్తి ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్తూ, గోడకున్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో అడ్డంగా ఇరుక్కుపోయాడు. యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు, గోడలో ఇరుక్కున్న దొంగను… pic.twitter.com/Y0Sj8lQC4y
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2026
యజమానులు రావడం గమనించిన మరో దొంగ, తన స్నేహితుడిని అక్కడే వదిలేసి కారులో పరారయ్యాడు. ఆ కారుపై పోలీసు స్టిక్కర్ ఉండటం గమనార్హం. ఆ దొంగ ముందుకు కదలలేక, వెనక్కి రాలేక సుమారు గంట సేపు అక్కడే నరకం అనుభవించాడు. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఈ విచిత్ర దృశ్యాన్ని చూశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఎంతో కష్టపడి అతడిని ఆ రంధ్రం నుండి బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, పరారైన అతని అనుచరుడి కోసం గాలిస్తున్నారు.
