ఫాం హౌజ్ పాలేర్లం కాదు, కేసీఆర్ మాటలకు భయపడొద్దు : అశ్వత్థామ రెడ్డి

ఫాం హౌజ్ పాలేర్లం కాదు, కేసీఆర్ మాటలకు భయపడొద్దు : అశ్వత్థామ రెడ్డి

హుజూర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై సంచలన కామెంట్లు చేశారు. ఆర్టీసీ సమ్మె కాదు… ఆర్టీసీనే మునుగుతుందని స్టేట్ మెంటిచ్చారు. ఆర్టీసీ యూనియన్లపై సీరియస్ కామెంట్లు చేశారు. సీఎం కామెంట్లపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కౌంటరిచ్చారు. ఆర్టీసీ ఎవరి జాగీరు కాదని వ్యాఖ్యానించిన ఆయన… సీఎం మాటలకు ఎవరూ భయపడొద్దన్నారు. ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే న్యాయస్థానం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఆర్టీ కార్మికులను అవమానించేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని.. కార్మికుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. తమవి గొంతెమ్మ కోరికలు కావన్న అశ్వత్థామ.. యూనియన్లు ఉన్నాయి కాబట్టే ఆర్టీసీ ఆస్థులను కాపాడుకోగలిగామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కరీంనగర్ సభలో కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు జేఏసీ కన్వీనర్. ఈ నెల 30న సరూర్ నగర్ లో నిర్వహించే సకలజనుల సమరభేరిని విజయవంతం చేయాలని అశ్వత్థామ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ మాటలతో ఎవరూ ధైర్యం కోల్పోవద్దని అంతిమ విజయం మనదేనన్నారు.