దాదా బన్‎గయా బీసీసీఐ ప్రెసిడెంట్

మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. 47 సౌరవ్ ఓ మాజీ క్రికెటర్ పూర్తిస్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా కార్యదర్శిగా, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమాల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో దాదా పట్టాభిషేకం పూర్తైంది. అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో దాదా ఎంపిక ఏకగ్రీవమైంది. అయితే ఈ పదవిలో గంగూలీ కేవలం 10 నెలల పాటే ఉంటాడు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ‘‘కూలింగ్ పీరియడ్’’ అంటే ‘‘తప్పనిసరి విరామం’’ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జూలైలో పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత మళ్లీ పోటీ చేసే అవకాశముంటుంది. ఐదేళ్లకు పైగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో దాదా ఉండటంతో ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగే ఛాన్స్ మిస్సయ్యాడు. గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) ప్రెసిడెంట్ గా ఉన్నాడు. దాంతో ఈ నిబంధన తప్పనిసరైంది.