ఇక సెలవు : ముగిసిన చిన్నమ్మ అంత్యక్రియలు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల ఆశృనయనాల మధ్య ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. లోధి రోడ్డులోని స్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరీ తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సుష్మకు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అర్థరాత్రి ఆమె మరణవార్త దేశాన్ని విషాదంలో ముంచింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్వేగానికి గురైంది. తెలంగాణ ఏర్పాటులో సోనియా తర్వాత కీలకంగా వ్యవహరించిన సుష్మా స్వరాజ్ ఇక లేరన్న వార్త విని ఘొల్లుమంది. హాస్పిటల్ నుంచి తొలుత ఆమె నివాసానికి తరలించారు. ఉదయం కార్యకర్తలు, పార్టీ నేతలు, అభిమానుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. సుష్మ పార్థివ దేహాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కంటతడి పెట్టారు. సుష్మ మరణం విదేశీ నేతలనూ కంటతడి పెట్టించింది విదేశాంగ శాఖ మంత్రిగా ఆమె అనుసరించిన దౌత్య నీతిని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు విదేశీ ప్రతినిధులు.

LEAVE A REPLY