కాంగ్రెస్ కప్పల తక్కెడ… రేవంత్ స్థానమెక్కడ ?

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. అందరికీ తెలిసిందే. ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు. ఏమైనా చేసే స్వేచ్ఛ ఉంటుంది. అదో కప్పల తక్కెడ. పైకి ఎక్కేవాళ్లను ఎక్కనివ్వరు. గుంజేవాళ్లు గుంజుతుంటారు. పార్టీ విధివిధానాలు, సీనియర్ల సూచనలు, జూనియర్ల సలహాలు అబ్బో చెప్పుకుంటూ పోతే వాళ్లిచ్చుకునే జస్టిఫికేషన్లు మామూలుగా ఉండవు. ప్రగతీ భవన్ ముట్టడి పిలుపునిచ్చిన కాంగ్రెస్ దాదాపు సక్సెస్ అయింది. క్యాడర్ లోనూ జోష్ పెరిగింది. చాన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందని గుర్తించేలా కాంగ్రెస్ కృషి చేసింది. కానీ అక్కడే ఓ చిక్కొచ్చి పడింది. పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తే.. క్రెడిట్ మొత్తం రేవంత్ కొట్టేస్తాడా ? అట్టెట్ట. అని గింజుకుంటున్నారట ఆ పార్టీ సీనియర్లు. సోషల్ మీడియాలో రేవంత్ వీడియో హల్ చల్ చేయడంతో మూకుమ్మడిగా గాంధీభవన్ చేరుకుని చర్చించుకున్నారట. పార్టీ తరఫున ఓ కార్యక్రమం చేపడితే దాన్ని అందరూ భాగస్వాములై చర్చించి.. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని సావధానంగా ఆలోచించి అందరం కలిసి ఫాలో చేయాల్సిందని రేవంత్ పై మండిపడుతున్నారట.

నిజానికి ప్రగతీ భవన్ ముట్టడి పిలుపుతో పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో సహా కీలక నేతలందర్నీ హౌజ్ అరెస్టు చేశారు పోలీసులు. ఒక్క రేవంత్ మాత్రమే దూకుడుగా వెళ్లి ప్రగతీ భవన్ గేటు టచ్ చేసి వచ్చారు. జగ్గారెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యారు. సంతోషించాల్సింది పోయి గాంధీభవన్ లో కూర్చుని కారాలు మిరియాలు నూరుతున్నారట కాంగ్రెసోళ్లు. అంతేనా సేమ్ టైం సర్వే సత్యనారాయణ పోరాటం సామాజిక మాధ్యమాల్లో కామెడీ అయింది. ఇలాంటి పార్టీనా ప్రభుత్వానికి కళ్లెం వేసేది… ప్రజాసమస్యలపై పోరాడేది అని జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ తీరు ఇక మారదని ఢీలా పడిపోతున్నారు కార్యకర్తలు. వెరీ బ్యాడ్. ఇంతకీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందా ? ఆంజనేయుడి పెళ్లిలా ఆ తంతు అలా సాగుతుందా ? ఏమో కాంగ్రెసోళ్లే చెప్పాలి మరి.