తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు రైతు సురేష్ మృతి

తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు రైతు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్… తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 65శాతం కాలిన సురేష్ కు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ.. న్యూరోబర్న్ షాక్‌లో ఉన్న సురేష్ పరిస్థితి బుధవారం మరింత విషమించింది. దీంతో సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూపట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని అన్నాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. లీటర్ పెట్రోల్ కొనుక్కుని బ్యాగ్‌లో ముందే పెట్టుకున్నానని అన్నాడు. మరోసారి భూపట్టా కోసం విజయారెడ్డిని వేడుకున్నానని… పట్టాలేదని చెప్పడంతో పెట్రోల్ పోసి తగులపెట్టానని వివరణ ఇచ్చాడు.

అయితే సురేష్ నుంచి మరోసారి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. దీనికోసం మేజిస్ట్రేట్ స్థాయి అధికారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. సురేష్ పరిస్థితి విషమించడంతో ఇవాళ (గురువారం) ఉదయం చనిపోయాడు. ఇక విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ చనిపోవడంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చూడాలి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.

Leave a Reply