బ్రేకింగ్ : తహశీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గుర్నాథం మృతి

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ గుర్నాథం మంగళవారం DRDO ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మంటల్లో చిక్కుకున్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డ్రైవర్ గుర్నాథం శరీరానికీ మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో గుర్నాథంకు 80 శాతం కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని DRDO అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మృతిచెందాడు.

విజయారెడ్డి కారు డ్రైవర్ గుర్నాథం

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. అతడికి భార్య, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య ఏడు నెలల గర్భిణి. గురునాథం మరణవార్త తెలిసిన నేపథ్యంలో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు ఆరేళ్లుగా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా భావించేవాడట. దీంతో ఆమె గుర్నాథాన్నే డ్రైవర్ గా కొనసాగించింది. గుర్నాథం తమ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మెలిగేవాడని విజయారెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న గుర్నాథం తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. అయితే లోపలి నుండి సురేష్ గడియపెట్టడంతో వీలుకాలేదు. తర్వాత మంటల్లో కాలుతూ సురేష్ కేకలు వేస్తూ బయటకొచ్చాడు. తలుపులు తెరుచుకునే లోపే మంటల్లో కాలిపోయిన విజయారెడ్డి హాల్ లోకి వచ్చి కుప్పకూలిపోయింది. క్షణాల్లో సజీవదహనమైంది. సజీవదహనమవుతన్న విజయారెడ్డిని డ్రైవర్ గుర్నాథం, అటెండర్ చంద్రన్న కార్పెట్లు, గోనె సంచులు వేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇదే ఘటనలో అటెండర్ చంద్రయ్య 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.