వైసీపీ చీకటి ఏజెండాతో ఉక్కు కార్మికులను రోడ్డున పడేసింది

వైసీపీ చీకటి ఏజెండాతో ఉక్కు కార్మికులను రోడ్డున పడేసింది

ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. వైసీపీ చీకటి ఎజెండాతో ఉక్కు కార్మికులు రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సహకారంతో పోస్కోతో కేంద్రం ఒప్పందం కుదిరిందన్న అచ్చెన్న… అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు పార్లమెంటు సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తున్నా వైసీపీ ఎంపీలు మౌనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నమ్మక ద్రోహానికి, నయవంచనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు. ఉక్కు కార్మికులపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ నేతలు వెంటనే రాజీనామా చేసి పోరాటానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టనున్న భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు తలపెట్టిన ఈ బంద్‌లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.