LPG Gas Cylinder : సిలిండర్ ఎక్కువ రోజులు రావాలా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!

LPG Gas Cylinder

LPG Gas Cylinder : ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో భారత్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేసుకునే కాలాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది.

అంటే, ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల సమయం ఉండాలి. ప్రజలు భయంతో సిలిండర్లను అడ్వాన్స్‌గా బుక్ చేసి నిల్వ చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వంటగదిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సిలిండర్ జీవితకాలాన్ని మరో 15 నుండి 20 రోజుల వరకు సులభంగా పెంచుకోవచ్చు.

మొదటగా గ్యాస్ బర్నర్ మంటను గమనించడం చాలా ముఖ్యం. మంట నీలం రంగులో వస్తే బర్నర్ శుభ్రంగా ఉన్నట్టు, అలా కాకుండా ఎరుపు లేదా పసుపు రంగులో వస్తే బర్నర్‌లో మురికి పేరుకుపోయి గ్యాస్ వృధా అవుతున్నట్టు లెక్క. కాబట్టి ఎప్పటికప్పుడు బర్నర్లను క్లీన్ చేసుకోవడం ద్వారా గ్యాస్ ఆదా చేయవచ్చు.

వంట చేసేటప్పుడు అనుసరించే పద్ధతుల్లో కూడా కొన్ని మార్పులు అవసరం. ఉదాహరణకు, గిన్నెను పొయ్యి మీద పెట్టే ముందు అది తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. గిన్నె తడిగా ఉంటే ఆ నీరు ఆవిరి కావడానికే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. అలాగే వంటకు ముందు పప్పులు లేదా బియ్యాన్ని కాసేపు నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది.

ఇక ఫ్రిజ్‌లో ఉంచిన పాలు లేదా కూరగాయలను తీసిన వెంటనే స్టవ్ మీద పెట్టకూడదు. వాటి చల్లదనం తగ్గి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు బయట ఉంచి, ఆ తర్వాతే వంటకు వాడితే త్వరగా వేడెక్కుతాయి. సాధ్యమైనంత వరకు ప్రెజర్ కుక్కర్ వాడటం వల్ల ఆవిరితో ఆహారం త్వరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది.

అన్నిటికంటే ముఖ్యమైనది గ్యాస్ లీకేజీని అరికట్టడం. రెగ్యులేటర్, పైపులు లేదా బర్నర్ దగ్గర స్వల్పంగా లీక్ ఉన్నా మనం వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అయిపోతుంది. ఇది ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి. వంటకు కావాల్సిన వస్తువులన్నీ ముందే సిద్ధం చేసుకుని స్టవ్ వెలిగించడం వల్ల మంటను అనవసరంగా ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం ఉండదు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ సిలిండర్ జీవితకాలాన్ని పెంచుకోవడంతో పాటు వృధా ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.