ఆర్టీసీ సమ్మెతో కార్మికుల మెట్టు దిగట్లేదు. ప్రభుత్వం పట్టు సడలించట్లేదు. సెప్టెంబరు జీతాలివ్వాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా సెప్టెంబరు జీతాలిచ్చేందుకు ఆర్టీసీ వద్ద పైసల్లేవని కోర్టుకు సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. ఆర్టీసీ యాజమాన్యం వద్ద జీతాలు చెల్లించేందుకు డబ్బు లేదని, ప్రస్తుతం సంస్థ వద్ద రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపింది. కార్మికులందరికీ జీతాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు అవసరమవుతాయని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మరోవైపు ప్రభుత్వ సమాధానంపై కార్మికులు మండిపడుతున్నారు. అదే నిజమైతే సమ్మెలో లేనివాళ్లకు జీతాలెలా పడ్డాయని, సమ్మె చేస్తున్న వాళ్లకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదన విన్న కోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సోమవారం(అక్టోబరు 21న) ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.