Traffic Challan : వాహనదారులకు తెలంగాణ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. పెండింగ్ చలానాల(Traffic Challan ) వసూళ్ల విషయంలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులను విచారించిన ధర్మాసనం, పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలానాలు చెల్లించమని ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
వాహనాలను తనిఖీ చేసే సమయంలో పాత చలానాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు, వాటిని వెంటనే కట్టాలని ఒత్తిడి చేయడం లేదా బైక్ తాళాలు లాక్కోవడం వంటివి చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చలానాలు చెల్లించలేదనే కారణంతో వాహనాన్ని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కోర్టు అభిప్రాయపడింది.
అయితే, వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారులు తమకు తాముగా స్వచ్ఛందంగా పెండింగ్ చలానాలు చెల్లిస్తామంటేనే పోలీసులు ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని హైకోర్టు వెల్లడించింది. అంతేకానీ, చలానా కట్టే వరకు వాహనాన్ని వదలమని చెప్పడం సరైన పద్ధతి కాదంది. ఆదాయం సమకూర్చుకోవడం కంటే ట్రాఫిక్ నియంత్రణపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది.
చలానాలు చెల్లించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయంది కోర్టు. వాటిని అనుసరించాలని పోలీసులకు హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది.
