Jubilee Hills By Election : డబ్బులు పంచుతూ 11 మంది కాంగ్రెస్ నాయకులు అరెస్ట్!

Jubilee Hills By Election

Jubilee Hills By Election :  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు రేపే ఓటింగ్ కావడంతో ప్రలోభాలు జోరందుకున్నాయి. భారీగా ఓటర్లకు నగదు పంచుతున్నాయి పార్టీలు. ఓటుకు వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. నగదుతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క బూత్ ఇన్‌ఛార్జ్‌కుకాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షలు, బీఆర్ఎస్ రూ. లక్ష అప్పగించాయని తెలుస్తోంది. అయితే అధికార యంత్రాంగం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలున్నాయి.

ఇక షేక్‌పేట డివిజన్‌ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే డబ్బులు పంపిణి చేశారు. ఆయా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మరీ చీరలు, డబ్బులు పంపిణి చేశారు. ఎర్రగడ్డలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో హోటల్ పాలక్‌పై పోలీసులు రైడ్ చేసి ఏకంగా 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే హోరాహోరి పోరు ఉందని తెలుస్తోంది.

మొత్తం 58 మంది అభ్యర్థులు

షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 11, 2025 (మంగళవారం) నాడు పోలింగ్ జరగనుంది. ప్రచారం ఆదివారం (నవంబర్ 9) సాయంత్రంతో ముగిసింది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా వి. నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు.బీఆర్‌ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇది నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డుగా చెబుతున్నారు.

పోలింగ్ ముగిసే వరకు (నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు), అలాగే ఓట్ల లెక్కింపు రోజున (నవంబర్ 14) మద్యం దుకాణాలను మూసివేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం.