Telangana : ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు పంచడం చాలా సాధారణం..ఒకవేళ ఓడిపోతే తిరిగి డబ్బులు వసూలు చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్!… ఇప్పుడు అంతటా ఇలాగే జరుగుతుంది. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది.
ఇటీవల జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోయాడు. తాను ఓడిపోవడంతో పంచిన డబ్బులు వసూలు చేసుకోవాలని అనుకున్నాడు. దేవుని ఫోటోతో తను, తన భార్య ఓ పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ మా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కల్లూరి బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి జక్కిలి పరమేష్ విజయం సాధించారు. ఈ గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలయ్యాయి.
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఓరవాణి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం మొదలుపెట్టారు. దేవుడి ఫోటో, పత్తి మందు సీసాతో ఇంటింటికీ తిరుగుతూ, "ఓటు వేయకుంటే నా డబ్బులు ఇవ్వండి" అంటూ వినూత్నంగా డిమాండ్ చేయడంతో… pic.twitter.com/GAjHvFylvj
— ChotaNews App (@ChotaNewsApp) December 13, 2025
ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో కూడా జరిగింది. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సొంత ఊరైన సోమ్లాతండాలో ఆయన వదిన భూక్య కౌసల్య ఇలాగే చేసింది. కాంగ్రెస్ తరఫున సర్పంచ్ గా పోటీ చేయగా.. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్‌రెబల్‌గా పోటీ చేసింది. అయితే సుజాత 17 ఓట్ల మెజార్టీతో గెలిచింది.
దీంతో ఓడిపోయిన భుక్యా కౌసల్య, ఆమె భర్త ధల్‌సింగ్, కొడుకు సందీప్ సేవాలాల్ జెండాతో తండాలో ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ‘మీరు నాకు ఓటు వేసినట్లు కులదైవమైన సేవాలాల్ జెండా పట్టుకొని ప్రమాణం చేయండి.. లేదంటే నేను పంచిన డబ్బులు నాకు ఇచ్చేయండి’ అంటూ వేడుకున్నారు.
