Jagtial : జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వతంత్ర అభ్యర్థులు సంచలన విజయం సాధించి, మున్సిపల్ పీఠాన్ని నిర్ణయించే స్థాయికి చేరుకున్నారు. మొత్తం 50 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో జగిత్యాలలో హంగ్ ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ కేవలం 12 స్థానాలకే పరిమితమైంది.మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 వార్డుల్లో మాత్రమే విజయం సాధించి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఎంఐఎం 2 వార్డుల్లో తన ఉనికిని చాటుకుంది.
ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం. వీరిలో మెజారిటీ అభ్యర్థులు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరులు కావడం గమనార్హం. టికెట్ల కేటాయింపులో జరిగిన అసంతృప్తి కారణంగా వీరంతా స్వతంత్రులుగా బరిలోకి దిగి, అధికార పార్టీ అభ్యర్థులపైనే విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలోనూ జీవన్‌రెడ్డి తన అనుచరులైన ఈ స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా నిలవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో, మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఈ 14 మంది స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. జీవన్‌రెడ్డి తన మద్దతుదారులతో కలిసి ఎలాంటి వ్యూహం రచిస్తారోనని జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
