Hyderabad : శంషాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన ఇద్దరు కవల పిల్లలు ఇక తనతో లేరన్న వార్తను ఓల భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో తనకు ఈ జీవితం వద్దని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్ కె.బాల్‌రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. .బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), అతని భార్య శ్రావ్య (35) దంపతులు ఏడాదిన్నర కిందట శంషాబాద్‌కు వచ్చి ఉంటున్నారు.
విజయ్ ఎయిర్‌పోర్టులో జాబ్ చేస్తుండగా.. శ్రావ్య గృహిణి.. పెళ్లైన చాలా ఏళ్ల తరువాత శ్రావ్య ఐవీఎఫ్ చికిత్సతో గర్భం దాల్చడం, పైగా అందులోనూ కవలలు ఉన్నారని తెలియడంతో ఇంకా ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం శ్రావ్య ఎనిమిది నెలల గర్భిణి. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నవంబర్16న రాత్రి ఒక్కసారిగా శ్రావ్యకు కడుపులో నొప్పులు రావడంతో వెంటనే ఆమెను అత్తాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో వారికి డాక్టర్లు ఊహించని షాకిచ్చారు. కవలలు గర్భంలోనే మృతి చెందారని చెప్పడంతో ఆ షాక్ తట్టుకోలేక శ్రావ్య స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రావ్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో భార్య, కలలు మాత్రమే మిగిల్చిన కవలలు ఈ తీరని బాధను విజయ్ తట్టుకోలేకపోయారు.
తన భార్య లేకుండా, తన కలల కవలలు లేనప్పుడు తనకు ఎందుకీ జీవితం అన్న బాధతో సోమవారం తమ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని రోజులు తేడాతో నాలుగు ప్రాణాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. నిన్నటి వరకు ఆనందంతో ఉండిన ఆ ఇల్లు నేడు శోకసంద్రమైంది. ఈ విషాద ఘటన వారి కుటుంబాన్ని, బంధువులను తీవ్రంగా కలిచివేసింది.
