BIG BREAKING : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరగగా.. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపేసినట్లు కోర్టుకు ఈసీ తెలిపింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు లాయర్ ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందని కోర్టుకు వివరణ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చాకే తదుపరి చర్యలుంటాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం చెప్పేందుకు 3 వారాల సమయం కావాలని కోర్టును కోరారు ప్రభుత్వం తరఫు లాయర్. అయితే 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని…రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో లేదన్న విషయం స్పష్టం అవుతోంది.
కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై (GO 9, 41, 42) హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50% పరిమితిని దాటరాదనే రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలకు తాము విరుద్ధంగా వ్యవహరించలేమని కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని తెలంగాణ మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది. వివిధ వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తులు తర్వాత ఆ పరిమితిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటించారు. ప్రస్తుత నిబంధన ప్రకారం, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు MPTC, ZPTC, వార్డు సభ్యుడు, సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి అనర్హులు.