Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సిఐడి (CID) అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఆయనపై హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు BNSS సెక్షన్ 35(3) కింద ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చారు. జాతర సమయంలో రోడ్డు మీద కూర్చుని ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.
• తెలంగాణ సీఐడీ నుంచి mla కౌశిక్ రెడ్డి కి నోటీసు
• BNSS సెక్షన్ 35(3) కింద విచారణ నోటీసు
• హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కేసు నంబర్ 30/2026 నమోదు
• సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో ఘటన
• రోడ్డు మీద కూర్చుని ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించిన ఆరోపణ
• ప్రజలకు అసౌకర్యం కలిగించారన్న ఆరోపణలు… pic.twitter.com/CsFud5mo8c— Sarita Avula (@SaritaAvula) March 31, 2026
విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఈ కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన అధికారులు, విచారణ కోసం రావాలని కౌశిక్ రెడ్డిని ఆదేశించారు.
వచ్చే ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 11:30 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. వచ్చేటప్పుడు తన గుర్తింపు కార్డులతో పాటు, ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్ష్యాలను మరుగున పరిచే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు. ఒకవేళ ఈ నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు రాకపోతే, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐడి వెల్లడించింది.
