T.Congress : మైనంపల్లి రచ్చ : కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాజీనామా!

T.Congress :  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వెంటనే తన రాజీనామాను ఆమెదించాలని కోరారు. చక్రధర్ గౌడ్ తన రాజీనామాకు ప్రధానంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రమేయాన్ని, ఆయన వల్ల ఎదురైన అవమానాలను పేర్కొన్నారు. సిద్దిపేటతో ఎలాంటి సంబంధం లేని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సిద్దిపేటలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు.

పార్టీ కోసం కష్టపడుతున్న తనను మైనంపల్లి హన్మంతరావు తల్లి పేరుతో అసభ్యంగా పదిమందిలో తిట్టడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి హన్మంతరావు తనతో కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ పోలీసు కేసులు, రౌడీషీట్లు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం బూటకమని, పార్టీలో బీసీలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. మైనంపల్లి హన్మంతరావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితంగా ఉండేవారని, ప్రస్తుతం బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేయకుండా ముఖం చాటేశారని ఆరోపించారు. అంతేకాకుండా, మైనంపల్లి త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లభించలేదని భావించి, పార్టీని వీడుతున్నట్లు చక్రధర్ గౌడ్ స్పష్టం చేశారు.భవిష్యత్తులో చక్రధర్ గౌడ్ ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.