Telangana : తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్ర సంఘటనలకు వేదికగా నిలుస్తున్నాయి. స్థానిక రాజకీయాల్లో పట్టు సాధించేందుకు, ప్రతిష్ఠ నిలుపుకోవడానికి కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీకి దిగుతున్నారు. అనేక గ్రామాల్లో సర్పంచ్ పీఠం కోసం భార్యాభర్తలు, అత్తాకోడళ్లు, తల్లీకూతుళ్లు, అన్నదమ్ముళ్లు వంటి బంధువులు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. ఇక్కడ బీసీ మహిళా రిజర్వ్‌డ్ కావడంతో సర్పంచ్ పదవి కోసం ఏకంగా తల్లి, కూతురే ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. ఇది గంగవ్వ కుటుంబానికి ఇష్టం లేదు. ఇప్పుడు వీరి మధ్య మాటలు కూడా లేవు.

ఇక సుమ తండ్రి గతంలో సర్పంచ్‌గా పోటీ చేశారు. తల్లికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపగా కూతురుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మొత్తం గ్రామంలో 506 ఓట్లు ఉండగా ఎనిమిది వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు పోటీ చేస్తుండగా తల్లి, కూతురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడటం వల్ల, ఆ కుటుంబంలోని బంధువులు, మద్దతుదారులు ఎవరికి ఓటు వేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
