Telangana : 9 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి నరికి చంపిన మామ

Telangana

Telangana : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన పరువు హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మామ తన 9 నెలల గర్భిణీ కోడలిని అత్యంత దారుణంగా, కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం జిల్లా, దహెగాం మండలం, గిరివెళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సత్యనారాయణ కుమారుడు శేఖర్‌ తన ఇంటికి ఎదురుగా ఉండే రాణిని ప్రేమించాడు.

ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇద్దరి కూలాలు వేరే కావడంతో సత్యనారాయణ అందుకు అంగీకరించలేదు. దీంతో శేఖర్ తాను ప్రేమించిన రాణినే ఏడాది కిందట పెళ్లి చేసుకుని అత్తవారి ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఇప్పుడు రాణి 9 నెలల గర్భిణీ. రేపో, మాపో ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఎవరో ఒకరు పుడితే సత్యనారాయణ మనసు మారుతుందని శేఖర్‌,రాణి అనుకున్నారు.

కానీ కులాంతారం వివాహం చేసుకోవడమే కాకుండా తన కొడుకును కూడా తన కుటుంబం నుంచి దూరం చేసిందని సత్యనారాయణ కోడలిపై మరింత పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం అత్తమామలతోపాటు శేఖర్‌ అడవికి వెళ్లినట్లు తెలుసుకున్న సత్యనారాయణ.. ఎవరూ లేని టైమ్ చూసి.. రాణిని అత్యంత దారుణంగా గొడ్డలి, కత్తితో నరికి మరి హత్య చేశాడు.

కులాభిమానంతో కళ్లు మూసుకుపోయిన మామ చేసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.