Ranga Reddy : ఈ నాలుగే కొంపముంచాయి.. చేవెళ్ల యాక్సిడెంట్ కు కారణాలు ఇవే!

Hyderabad

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 24 మంది ప్రయాణికులు చనిపోయారు. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమం ఉంది.

చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి మృత దేహాలను తరలిస్తున్నారు అధికారులు. అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి గల ప్రధాన కారణాలుగా చూసుకుంటే నాలుగు కనిపిస్తున్నాయి.

టిప్పర్ లారీ అతివేగం : కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ మితిమీరిన వేగంతో నడపబడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వేగం కారణంగా డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ మృతి చెందారు.

రాంగ్ రూట్ : టిప్పర్ లారీ రాంగ్ రూట్‌లో వెళ్లింది. ఎదురుగా వస్తున్న బస్సును దాటే క్రమంలో అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది.

ఇరుకైన రహదారి : రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల, ఎదురుగా వచ్చే భారీ వాహనాలు అతివేగంతో ఒకదానినొకటి దాటే క్రమంలో కంట్రోల్ కోల్పోయి ఢీకొన్నాయి. మొయినాబాద్ నుండి చేవెళ్ల వరకు సుమారు 46 కి.మీ. మేర నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు వివిధ కారణాల వల్ల ఆలస్యం అయ్యాయి. ఇది కూడా ప్రమాద తీవ్రతను పెంచింది.

కంకర లోడ్ : టిప్పర్ లారీలో కంకర లోడ్ ఉండటం వల్ల ఢీకొన్నప్పుడు దాని బలం చాలా ఎక్కువగా ఉండి, బస్సుకు తీవ్ర నష్టం కలిగింది. అలాగే కంకర బస్సు లోపల ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక కూడా తీవ్ర ప్రాణ నష్టాన్ని పెంచింది.

రంగారెడ్డి బస్సు ప్రమాదంపై హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు: 9912919545, 9440854433.. ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు వీటి ద్వారా సమాచారం పొందవచ్చు.