Ponguleti : మంత్రి పొంగులేటికి బిగ్ షాక్!

ponguleti

Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడికి చెందిన కంపెనీపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీతో పాటు మరో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఏకంగా ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి షా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం, నవంబర్ 30వ తేదీన వట్టినాగులపల్లి ప్రాంతంలోని ఒక భూమిలోకి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న గోశాలను సైతం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

నెంబర్‌ ప్లేట్లు లేని జేసీబీ (JCB) యంత్రాలను తీసుకువచ్చి, అక్కడ ఉన్న షెడ్లను కూల్చివేశారని పల్లవి షా తన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ బిల్డర్స్‌తోపాటు మరికొందరి మీద 329(3), 118(1), 324(4), 304(2), 127(2), 351(2) r/w 3(5)సెక్షన్‌ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు.

అయితే తన కుమారుడి కంపెనీపై వచ్చిన ఈ ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో తన కుమారుడు లేదా కంపెనీకి ఎలాంటి ప్రమేయం లేదని, పూర్తి దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు.