Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గజం ధర ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో (Hyderabad Real Estate)గచ్చిబౌలి ప్రాంతం హాట్ కేకులా మారింది. ఇక్కడ చదరపు గజం ధర ఏకంగా రూ. 1.76 లక్షల రికార్డు ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. నగరంలోని గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో, కొనుగోలుదారులు వీటిని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు.
ఈ వేలం పాట వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో గజం ధర రూ. 1.64 లక్షలుగా నమోదైంది. అలాగే చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లు కూడా గజం రూ. 84 వేల నుంచి రూ. 74 వేల వరకు అమ్ముడయ్యాయి. నిజాంపేటలో కేవలం 15 లక్షల కనిష్ట ధర నిర్ణయించిన ఒక ప్లాటు ఏకంగా రూ. 17.70 లక్షలకు అమ్ముడుపోవడం విశేషం. మొత్తం 14 ప్లాట్లను వేలంలో ఉంచగా, బోర్డుకు దీని ద్వారా రూ. 34.27 కోట్ల భారీ ఆదాయం సమకూరిందని హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.
కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మకానికి ఉంచిన వాటిలో చాలా వరకు ఎల్‌ఐజీ, హెచ్‌ఐజీ కేటగిరీ ప్లాట్లు కావడంతో మధ్యతరగతి మరియు ఎగువ మధ్యతరగతి వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా గచ్చిబౌలిలో 263 గజాల ప్లాటుకు గజానికి రూ. 50 వేల ధర నిర్ణయిస్తే, అది ఏకంగా మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడైంది. ఈ వేలం ఫలితాలను చూస్తుంటే హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
Also Read :
- Term Insurance: టీ కప్పు ఖర్చుతో రూ. కోటి లైఫ్ ఇన్సూరెన్స్.. మీ కుటుంబానికి కొండంత అండ!
- Personal Finance Tips : మీ జీతం తక్కువైనా సరే.. నెలకు రూ.10 వేలు ఆదా చేయడం ఎలా?
