Hyderabad : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి మృతి!

Hyderabad : అమెరికాలోని చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad )అమ్మాయి మృతి చెందింది. బాధితురాలిని శ్రీజా వర్మ అనే 22 ఏళ్ల యువతిగా గుర్తించారు పోలీసులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన శ్రీజా వర్మ సోమవారం రాత్రి తాను నివాసం ఉండే అపార్ట్ మెంట్ నుంచి కారులో భోజనం చేసి తిరిగి వస్తుండగా ఆమె కారును ఒక ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా కారులో ఉన్నారు. వారికి కూడా గాయాలైనట్లుగా సమచారం. శ్రీజా వర్మ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా సిద్దిపేట జిల్లాలోని రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ వర్మ, హేమలత అనే దంపతులకు శ్రీజా వర్మ, శ్రేయా వర్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే కొన్ని ఏళ్ల కింద వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్‌ వర్మ డ్రైవర్‌గా పనిచేస్తుండగా అతని భార్య ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. పెద్ద అమ్మాయి శ్రీజ ఉన్నత చదువులకోసమని ఆమెరికాకు వెళ్లింది. అక్కడే ఈ మధ్యే ఎంఎస్‌ కూడా పూర్తి చేసింది. ఇక శ్రేయా వర్మ సైతం ఎంఎస్‌ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లింది.