Hyderabad : సైబరాబాద్ పరిధిలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. కేవలం హెల్మెట్ ధరిస్తే సరిపోదని, దాని పట్టీ (స్ట్రాప్) కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై గత రెండు రోజులుగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
గత రెండ్రోజుల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 3,072 మందిపై కేసులు నమోదు చేసి చలానాలు విధించారు.
చాలామంది వాహనదారులు పోలీసులకు భయపడి హెల్మెట్ తల మీద పెట్టుకుంటున్నారు తప్ప, దాని పట్టీని పెట్టుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎగిరిపోయి తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే హెల్మెట్ పెట్టుకున్నా, స్ట్రాప్ పెట్టుకోని 173 మందిపై కూడా ఈ డ్రైవ్లో చలానాలు విధించారు.
ప్రయాణీకుల భద్రత కోసమే ఈ నిబంధనలు కఠినతరం చేశామని, వాహనదారులు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇకపై హెల్మెట్ ధరించడంతో పాటు స్ట్రాప్ పెట్టుకోవడం మర్చిపోవద్దు!
