Hyderabad : హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు, పెళ్లి బట్టలు ధరించి ఓయో రూములోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఏపీలోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన లోకేష్ (29), గండిమైసమ్మ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతితో అతను ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, శనివారం నాడు ఆర్యసమాజ్ లేదా ఏదైనా గుడిలో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
ఈ క్రమంలో, నిన్న శుక్రవారం కేపీహెచ్బీ పరిధిలోని ఒక ఓయో రూమును లోకేష్ అద్దెకు తీసుకున్నాడు. తాను ఇప్పటికే పెళ్లి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్నానని, తనకు భోజనం తీసుకురావాలని తన ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో సదరు యువతి భోజనం తీసుకుని అక్కడికి చేరుకుంది. అయితే, ఆమె ఎంతసేపు తలుపు తట్టినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లోకేష్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన యువతి, ఓయో సిబ్బంది సాయంతో గది తలుపులు బద్దలుకొట్టింది. లోపల చూడగా, అప్పటికే లోకేష్ పెళ్లి దుస్తుల్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి జరగాల్సిన సమయంలో ఇలాంటి ఘోరం జరగడంతో ఆ యువతి, మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
