Telangana : సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, ఒకే ఊరిలో పోస్టింగ్ రావడం అదృష్టంగా భావిస్తారు. అలాంటిది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకంగా ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ జంటలకు ఒకే చోట పనిచేసే అవకాశం లభించింది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల వల్ల ఇది సాధ్యమైంది.
హనుమకొండలో ఐఏఎస్ జంట
చాహత్ బాజ్‌పాయ్ ఇప్పటివరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ఈమె, తాజాగా హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈమె 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఈమె భర్త వరుణ్ రెడ్డి కూడా ఐఏఎస్ ఆఫీసరే. ఈయన హనుమకొండ కేంద్రంగా పనిచేసే టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) సిఎండీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

మహబూబాబాద్‌లో ఐఏఎస్, ఐపీఎస్ జంట
హనుమకొండ కలెక్టర్‌గా ఉన్న స్నేహా శబరీష్ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈమె భర్త డాక్టర్ శబరీష్ ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా (SP) పనిచేస్తున్నారు. ఇలా ఇద్దరు ఉన్నతాధికారి జంటలు పక్కపక్కనే లేదా ఒకే జిల్లాలో కీలక పదవుల్లో పనిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే జిల్లాలో కలెక్టర్‌గా భార్య, ఎస్పీగా భర్త ఉండటం అరుదైన విషయమని స్థానికులు చెప్పుకుంటున్నారు.

