Hyderabad : కొంపముంచిన ఇన్‌స్టాగ్రామ్ అడ్వర్‌టైజ్‌మెంట్ .. రూ. 30 లక్షలు పోగొట్టుకున్న యువతి!

Hyderabad

Hyderabad :  సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఓ యువతి భారీగా మోసపోయిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్ గేమింగ్ అడ్వర్‌టైజ్‌మెంట్‌ను క్లిక్ చేసినందుకు ఆ యువతి ఏకంగా రూ.30 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, ఏకంగా రూ. 26.07 కోట్ల ఆన్‌లైన్ బెట్టింగ్ మోసపు నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ కేసులో రాజేష్ వెంకట రామన్‌, భామిడిపాటి అభిషేక్, అగస్టిన్ విలియమ్స్, మన్మీత్ శర్మ అలియాస్ సోనియా అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేవలం 24 ఏళ్ల వయసున్న బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గేమింగ్ యాడ్‌ను చూసి క్లిక్ చేయగా, అది ఆమెను వాట్సాప్ ద్వారా ఒక ఆన్‌లైన్ క్యాసినో ప్లాట్‌ఫారమ్‌కు చేర్చింది. మొదట్లో ఆమెను నమ్మించడానికి తక్కువ మొత్తంలో గెలుచుకున్న డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఆ నమ్మకంతో ఆమె వివిధ యూపీఐ లావాదేవీల ద్వారా సుమారు రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేస్తూ పోయింది. తీరా అంతా అయ్యాక, ఆమె బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడమే కాకుండా, లియన్ మార్క్ పడటంతో తను మోసపోయానని గ్రహించింది.

పోలీసుల విచారణలో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ నెట్‌వర్క్ ‘CloseX Pay’, ‘Trustly Pay’, ‘Accult Pay’ వంటి నకిలీ పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించి బెట్టింగ్ డబ్బును మళ్లించేవారు. ఇందుకోసం అమాయకుల పేరుతో తెరిచిన మ్యూల్ అకౌంట్లు, నకిలీ కంపెనీల కేవైసీ పత్రాలను వాడినట్లు తేలింది. ఇప్పటివరకు ఈ నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ. 26 కోట్ల రూపాయల బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి పోలీసులు 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్లు, 9 చెక్కు బుక్కులు, 2 షెల్ కంపెనీల స్టాంపులతో పాటు రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర లింకులను, పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.