Kavitha : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని, కొత్త తరహా రాజకీయాలను ప్రజలు ఆదరిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అపొజిషన్‌లో ఉన్నప్పటి ఫలితాలతో బీఆర్ఎస్ నేతలు పోల్చుకోవడం హాస్యాస్పదమని, 90 శాతం నుండి 16 స్థానాలకు పడిపోయిన బీఆర్ఎస్ తన పతనంపై సమీక్షించుకోవాలని ఆమె హితవు పలికారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీగా సహకరించుకున్నాయని కవిత ఆరోపించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని, ఇది వారి భవిష్యత్తు పొత్తుకు తొలిమెట్టు అని ఆమె విశ్లేషించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని ఆమె అభిప్రాయపడ్డారు.
కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇవ్వాలన్న బీఆర్ఎస్ నిర్ణయాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కేసీఆర్‌పై కాళేశ్వరం విషయంలో ఆరోపణలు చేసిన సీపీఐకి మద్దతివ్వడం అంటే ఆ ఆరోపణలను అంగీకరించడమేనని ఆమె అన్నారు. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిన సీపీఐకి మద్దతివ్వడం సింగరేణి కార్మికులను వంచించడమేనని మండిపడ్డారు. సింగరేణిలో కార్మికుల పక్షాన నిలిచేది కేవలం జాగృతి, హెచ్‌ఎంఎస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన తమను ప్రజలు ఆశీర్వదించారని కవిత తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి కలిసి పోటీ చేయగా.. ప్రజలు 40 మంది అభ్యర్థులను గెలిపించారని ఆమె వెల్లడించారు. వడ్డేపల్లిలో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని, నారాయణపేటలో వైస్ ఛైర్మన్ పదవి ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా సుభాషిజం, ఉద్యమ స్ఫూర్తితో గెలవడం తమ నైతిక విజయమని ఫార్వర్డ్ బ్లాక్ నేతలు స్పష్టం చేశారు.
Also Read :
