Kavitha : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించినట్లు కవిత తెలిపారు. ఇప్పుడు ఆమె ఏం చేయబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కవిత ప్లాన్ చూస్తుంటే అచ్చం ఆమె తండ్రిని ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో మంత్రి వరకు ఎదిగిన కేసీఆర్ .. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంతో ఆ పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని స్థాపించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తానని, తనకు పదవులు ముఖ్యం కాదని కేసీఆర్ పులుమార్లు చెప్పేవారు. TRS పార్టీ ఏర్పాటు తరువాత స్థానిక సంస్థలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇక ఉద్యమంలో కూడా ఉప ఎన్నికలను కేసీఆర్ ప్రధాన అస్త్రలుగా వాడుకున్నారు. ఇవే రానురానూ టీఆర్ఎస్ కు బాగా సెంటిమెంట్ గా మారాయి. ఉద్యమంలోనే హీరోగా నిలిచి పార్టీని 2014లో అధికారంలోకి తీసుకువచ్చారు కేసీఆర్.
సరిగ్గా ఇదే ప్లాన్ తో కవిత ఉన్నట్లుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత తన తండ్రిలాగే పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరనని చెప్పిన కవిత కొత్త ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పకనే చెప్పారు.
తాను ఉద్యమం నుంచి వచ్చాను.. తిరిగి ఉద్యమంలోకి వెళ్తానని అన్నారు. ఉద్యమాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని కవిత ప్లాన్ గా తెలుస్తోంది. అప్పుడు కేసీఆర్ కొత్త పార్టీ పెట్టినప్పుడు స్థానిక సంస్థలు వచ్చాయి. ఇప్పుడు కూడా త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్నాయి. కేసీఆర్ ఉప ఎన్నికలను ప్రధాన అస్త్రలుగా వాడుకున్నారు. ఇప్పుడు కవితకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెడీగా ఉంది. ఈ ఎన్నికల్లో కవిత బరిలో దిగే అవకాశం కూడా ఉంది. తద్వారా ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని గట్టి పునాది వేయాలని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్, టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. మరి కవిత ఏ సెంటిమెంట్ తో రాజాకీయం చేస్తారన్నది మరో ఇంట్రెస్టింగ్.