BIG BREAKING : తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. మరో మూడు రోజుల్లో మనవరాలి పెళ్లి ఉందనగా.. సీపీఎం సీనియర్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. మధిర శాసనసభ నియోజకవర్గం, చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామంలో సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్కిస్ట్) సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు అయిన సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు చంపేశారు.
పాతర్లపాడు గ్రామంలో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు మాటు వేసి అడ్డగించి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు.రామారావు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి సామినేని రామారావుమనవరాలి పెళ్లి ఇంకో మూడు రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉంది.
ఈ శుభకార్యానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు, దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో హింసా రాజకీయాలకు తావులేదన్నారు. కాగా పాతర్లపాడు మాజీ సర్పంచ్‌గా రామారావు సేవలందించారు. ఈ ఘటన ఖమ్మంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
ఖమ్మం జిల్లా పాతర్లపాడులో దారుణం.. సీపీఎం నేత సామినేని రామారావును హత్య చేసిన దుండగులు.. పాతర్లపాడు మాజీ సర్పంచ్‌గా పనిచేసిన రామారావు… సామినేని రామారావు హత్యపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి.. ఖమ్మంలో శాంతి భద్రతలపై పోలీసులకు హెచ్చరిక.. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు..…
— NTV Breaking News (@NTVJustIn) October 31, 2025
