Hyderabad: జూబ్లీహిల్స్‌ బైపోల్.. గాలిపటంతో ఆరు డ్రోన్లు ధ్వంసం… దొంగోట్లు పడ్డాయా?

Hyderabad

Hyderabad:  మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా అక్రమాలను పర్యవేక్షించడానికి దేశంలోనే తొలిసారిగా ఎన్నికల సంఘం నిఘా డ్రోన్‌లను -ఏర్పాటు చేసింది. అయితే గుర్తు తెలియని దుండగులు గాలిపటాలను ఉపయోగించి ఆరు డ్రోన్‌లను కూల్చివేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 139 మంది లైసెన్స్ పొందిన డ్రోన్ పైలట్లు ఎన్నికల విధుల్లో ఉన్నారు. కానీ నాలుగు ప్రాంతాలలో డ్రోన్లు ధ్వంసం అయ్యాయి.

రహమత్ నగర్, కార్మిక నగర్‌ లలో రెండేసి  మధురానగర్, షేక్‌పేట్‌లలో ఒక్కొక్కటి. దాదాపు రూ. 2.5 లక్షల విలువైన ప్రతి డ్రోన్‌ ధ్వంసం అయింది. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతి పైలట్ కు రూ. 12,000 వేతనం చెల్లించి, పోలింగ్ కేంద్రాల చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో నిఘాను ఏర్పాటు చేశారు.

మూడు బ్యాటరీలతో అమర్చబడి, మూడు గంటల నిరంతర సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్లను GHMC ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ సెంటర్ కు అనుసంధానించారు. అక్కడ రోజంతా ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయి. ఈ డ్రోన్లు కూల్చివేయడం వెనుక -ఏమైనా కుట్ర ఉందా.. దొంగ ఓట్లు ఏమైనా పడ్డాయా అనే చర్చ నడుస్తోంది. ఎన్నికల నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్న క్రమంలో ఇలా దుండగులు వాటిని ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది.