Telangana : అతను న్యాయం కోసం పోరాడే లాయర్ (LLB), ఆమె డిగ్రీ (B.Com) చదివిన ఇల్లాలు. ఒకప్పుడు సమాజంలో గౌరవంగా బతికిన ఈ దంపతులు… ఇప్పుడు వేములవాడ రాజన్న గుడి మెట్లపై యాచకులుగా మారుతారని ఎవరూ ఊహించలేదు. కాలం కలిసిరాక, అనారోగ్యం తోడవడంతో ఆ దంపతుల జీవితం రోడ్డున పడింది.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శిరీషకు 2006లో వివాహం జరిగింది. జలంధర్ రెడ్డి కరీంనగర్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ గౌరవంగా జీవించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి జీవితాలను తలకిందులు చేసింది. లాక్‌డౌన్ వల్ల ప్రాక్టీస్ దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయారు. ఇదే సమయంలో భార్య శిరీష అనారోగ్యానికి గురైంది. ఉన్న డబ్బంతా ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. పిల్లలు లేకపోవడం, ఆదుకునేవారు కరువవ్వడంతో మనస్తాపానికి గురై రెండేళ్ల క్రితం వేములవాడకు చేరుకున్నారు.
అప్పటినుంచి ఈ దంపతులు రాజన్న ఆలయ మెట్లపైనే ఉంటున్నారు. ఎవరినీ చేయి చాచి అడగకుండా, ఎవరైనా పెడితే తింటూ, లేదంటే పస్తులుంటున్నారు. ఇటీవల అధికారులు ఆలయ పరిసరాల్లో ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారి నేపథ్యం విని అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు. ఈ కాలంలో భార్య కోసం అన్నీ వదులుకుని, ఆమె వెంటే ఉంటూ తోడుగా ఉంటున్న జలంధర్ రెడ్డి ప్రేమను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోతున్నారు.
“మేము అడుక్కునే వాళ్లం కాదు.. పరిస్థితులు మమ్మల్ని ఇక్కడికి తెచ్చాయి. రోజూ గుడి మెట్లను శుభ్రం చేస్తూ కాలం గడుపుతున్నాం. ప్రభుత్వం మాకు ఏదైనా ఉపాధి చూపిస్తే, ఈ మెట్లు వదిలి గౌరవంగా బతుకుతాం” అని జలంధర్ రెడ్డి కన్నీళ్లతో చెబుతున్నారు.
