Mahabubabad : ప్రియుడి పట్టుబట్టాడు.. ప్రియురాలు పరీక్షలున్నాయని ఆపింది.. క్షణికావేశంలో!

Mahabubabad

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పెళ్లి విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం ఒక యువకుడి ప్రాణం తీసింది. కురవికి చెందిన 21 ఏళ్ల వల్లపునేని శశికుమార్ అనే యువకుడు పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను కేసముద్రం శివారు తండాకు చెందిన 20 ఏళ్ల ఇంటర్ చదువుతున్న యువతితో గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నాడు.

వీరిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే బుధవారం శశికుమార్ తన ప్రియురాలికి ఫోన్ చేసి, ఇద్దరం ఈ రోజే పెళ్లి చేసుకుందామని గట్టిగా పట్టుబట్టాడు. దానికి ఆ యువతి ఇప్పుడు తనకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, అవి పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామని చాలా సేపు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.

కానీ శశికుమార్ మాత్రం వెంటనే పెళ్లి కావాలని పట్టుబట్టడంతో వీరిద్దరి మధ్య ఫోన్లోనే వాగ్వాదం చోటుచేసుకుంది. తన మాటను ప్రియురాలు కాదనడం, తను చెప్పినట్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శశికుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో కురవిలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో ఆ యువతి, అప్పటివరకు కళ్లముందే తిరిగిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక చిన్న మాట పట్టింపు ఇద్దరి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.